: నేడు కొమురవెల్లి మల్లన్న సన్నిధికి తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలోని ఆలయంలో జరిగే స్వామి కల్యాణంలో కేసీఆర్ పాల్గొంటారు. నేటి ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్, నేరుగా కొమురవెల్లి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. తెలంగాణలో ప్రసిద్ధిగల దేవాలయాల్లో కొమురవెల్లి ఆలయం ఒకటి. కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవానికి తెలంగాణ, ఏపీ నుంచే కాక కర్ణాటక, మహరాష్ట్రల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆలయంలో భక్తులకు సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు సమస్యలపై కేసీఆర్ ను ఇటీవలే సంప్రదించారు. దీంతో స్పందించిన కేసీఆర్, నేడు ఆలయ సందర్శనకు వస్తున్నారని, అంతేకాక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల విడుదలపై ప్రకటన చేయనున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. నేటి మల్లన్న కల్యాణోత్సవంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా పాల్గొననున్నారు.