: తమిళనాడు బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి?


తమిళనాట రాజకీయ నాయకత్వాలు మారుతున్నాయా?, డీఎంకేలో అన్నదమ్ముల మధ్య విభేదాలు పార్టీని భ్రష్టుపట్టించాయి. అన్నాడీఎంకే అధినేత్రి అవినీతి ఆరోపణలతో ఇంటికే పరిమితమైపోయింది. కాంగ్రెస్ పార్టీ చీలికలతో చిక్కిశల్యమైంది. దీంతో తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. జాతీయ పార్టీలకు దక్షిణ భారతదేశం కొరుకుడు పడని కొయ్యలా ఉండేది. ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలేవి, లేని పక్షంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం చాటేది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన తప్పిదాలు దక్షిణాదిలో ఇంచుమించుగా ఆ పార్టీని తుడిచిపెట్టేశాయి. ఈ దశలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు తమిళనాడు సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ను ప్రకటించనున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వివాదాల్లో చోటులేకపోవడం, పార్టీ అగ్రనాయకత్వానికి నమ్మదగిన వ్యక్తి కావడం అదనపు అర్హతలుగా పేర్కొనవచ్చు. ఆమెను తమిళనాట బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, సాధారణంగా దక్షిణాదిలో మహిళలంటే ఉండే గౌరవంతో పాటు, ఆమె ట్రాక్ కూడా ఆమెను గెలిపించే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. దీంతో తమిళనాట పార్టీలో భారీ మార్పులు చేసి, పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, కేంద్రంతో సంప్రదింపులు చేసి అప్పుడు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News