: భారతీయులు దీర్ఘాయుష్కులు: తాజా అధ్యయనం
ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే భారతీయులు ఆరోగ్యకరంగా దీర్ఘాయుష్కులుగా బతుకుతున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. గడచిన రెండు దశాబ్దాల్లో భారతీయులు ఆరోగ్యకరంగా, ఎక్కువ కాలం జీవిస్తున్నారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ మెట్రిక్స్, ఎవల్యూషన్స్ (ఐహెచ్ఎంఈ) నేతృత్వంలో 700 మంది పరిశోధకులు దాదాపు 188 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ నివేదికను ప్రతిష్ఠాత్మక లాన్సెట్ పత్రిక ప్రచురించింది. గడిచిన రెండు దశాబ్దాల కంటే భారతీయులు ఆరోగ్యకరంగా జీవిస్తున్నారని, అంటువ్యాధులు, హృద్రోగ సమస్యలు చెప్పుకోతగ్గ సంఖ్యలో తగ్గాయని వారు వెల్లడించారు. 1990 నుంచి 2013 మధ్య భారతీయుల జీవిత కాలం కూడా పెరిగినట్టు గుర్తించామని పరిశోధకులు వివరించారు. అంతకు ముందు సగటు భారతీయుని జీవితకాలం 57.3 ఉండగా అది 64.2 కు పెరిగిందని, మహిళల్లో 58.2 నుంచి 68.5కు పెరిగిందని అధ్యయనం వివరించింది. అలాగే మరణాల రేటు పిల్లల్లో 3.7 ఉండగా పెద్దల్లో 1.3గా ఉందని అధ్యయనం వివరించింది. పెరుగుతున్న మరణాల్లో కూడా మూత్ర పిండాల వ్యాధులు, మితిమీరిన మందుల ప్రభావమేనని వారు స్పష్టం చేశారు.