: నా స్నేహితుడు నా ఒళ్లోనే మరణిస్తే ఎలా మరవడం?: 'పెషావర్ మారణకాండ' ప్రత్యక్ష సాక్షి


"ఏడేళ్లుగా కలిసే చదువుకున్నాం, ఒకే బెంచ్ లో పక్కపక్కన కూర్చుని చదువుకున్నాం. అలాంటి స్నేహితుడు మరణిస్తే ఎలా మర్చిపోవడం?" అంటూ పెషావర్ మారణకాండకు ప్రత్యక్ష సాక్షి తల్లడిల్లిపోతున్నాడు. పెషావర్ లో జరిగిన దారుణమారణకాండకు ప్రత్యక్ష సాక్షి ఇంటర్మీడియట్ చదువుతున్న అమీన్ జరిగిన దారుణం గురించి మాట్లాడాడు. "ఇంటర్వెల్ సమయంలో కళాశాల కారిడార్ లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఉగ్రవాదులు స్కూల్ లో చొరబడి కాల్పులకు తెగబడుతున్నారని తెలిసింది. దీంతో మేమిద్దరం కెమిస్ట్రీ ల్యాబ్ లోకి పరుగెత్తుకెళ్లి దాక్కున్నాం" అన్నాడు. అయితే ఉగ్రవాదులు ల్యాబ్ ను కూడా వదల్లేదని తెలిపాడు. ల్యాబ్ తలుపులు తీసి లోపలికొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపాడు. దీంతో ల్యాబ్ లో తనతోపాటు ఉన్న ఐదుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు మరణించగా, తన స్నేహితుడు తన ఒడిలోనే రక్తపుమడుగులో మరణించాడని తెలిపాడు. తనకు బుల్లెట్ తగిలి స్పృహ కోల్పోవడంతో మరణించానని భావించి తీవ్రవాదులు వెళ్లిపోయారని తెలిపాడు. గంట తరువాత వచ్చిన సైనికులు తనను కాపాడారని చెప్పాడు. జరిగిందంతా హారర్ సినిమాలా అనిపించినా అది వాస్తవమని తెలిపాడు. తన లాగే తన స్నేహితులు కొందరు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారని తల్చుకుని తల్లడిల్లిపోయాడు. జరిగిన దారుణాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్పిన అమీన్, తన స్నేహితుడ్ని మర్చిపోవడం అసాధ్యమని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News