: 'ఘర్ వాపసీ' ప్రధాని కోసం చేపట్టాలి: విపక్షాల సెటైర్
దశాబ్దాల కిందట ముస్లిం మతంలోకి వెళ్లిన హిందువులను తిరిగి హైందవంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. 'ఘర్ వాపసీ' (తిరిగి ఇంటికి రావడం) పేరుతో హిందుత్వ సంస్థలు మత పునఃమార్పిడికి ప్రోత్సహిస్తున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సభకు రావాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ మాట్లాడుతూ, రాజ్యసభలో ప్రధాని మోదీ ఎక్కువగా కనిపించడంలేదని, ఇప్పుడు ఆయన కోసం కూడా 'ఘర్ వాపసీ' కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. వామపక్ష నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ, ఈ మత పునఃమార్పిడి అంశంపై చర్చకు ప్రధాని అందుబాటులో ఉంటారా... ఉండరా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బదులిస్తూ, విపక్షం నిరసన మాత్రమే తెలపాలనుకుంటోందని, నిర్మాణాత్మక చర్యలను కోరుకోవడంలేదని విమర్శించారు.