: 'పీకే' సినిమాపై సచిన్ స్పందన
ముంబయిలో 'పీకే' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినూత్న ప్రచారంతోనే సగం హిట్ కొట్టిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ప్రముఖుల కోసం మంగళవారం ప్రత్యేకమైన షో వేశారు. అమీర్ ఖాన్ మిత్రుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ సినిమా చూశాడు. అనంతరం మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా ఉందన్నాడు. అయితే, అమీర్ కు ప్రామిస్ చేశానని, అందుకే సినిమా కథ గురించి చెప్పలేనని అన్నాడు. అందరూ ఈ సినిమాకు వెళ్లాలని, పూర్తిగా డిఫరెంట్ మూవీ అని పేర్కొన్నాడు. "నా వరకు అమీర్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అత్యుత్తమ చిత్రం ఇదే. ఈ సినిమాలో అతని పాత్ర పూర్తిగా విభిన్నం. ఈ చిత్రంలో బలమైన సందేశం ఉంటుంది. తప్పక చూడాల్సిన సినిమా. సందేహమే లేదు, అత్యుత్తమ నటన కనబరిచాడు" అని సచిన్ పేర్కొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క శర్మ, సంజయ్ దత్, సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తదితరులు నటించారు.