: బాలచందర్ త్వరగా కోలుకోవాలని కమల్ హాసన్ ఆకాంక్ష
జ్వరం, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, తన గురువు బాలచందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు నటుడు కమల్ హాసన్ తెలిపారు. ప్రస్తుతం కమల్ 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకుని వెంటనే ఆయన మేనేజర్ కు ఫోన్ చేసి మాట్లాడారట. ఈ మేరకు తన గురువు ఆరోగ్యంపై ఓ వీడియోలో కమల్ మాట్లాడారు. "'ఉత్తమ్ విలన్' చాలా త్వరగా పూర్తి చేయాలని ఇటీవల బాలచందర్ సర్ నన్నడిగారు. విడుదలకు ముందే ఆ సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పారు. కాబట్టి ఆయన ఆత్రుతను నేను అర్థం చేసుకోగలను. బాలచందర్ సర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఆయన మేనేజర్ కు ఫోన్ చేశాను. స్పృహలో లేరని, కొన్ని రోజుల నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదని చెప్పారు. అయినప్పటికీ ఫోన్ లో నేను పలకరించినప్పుడు పీల గొంతుతో స్పందించారు. పని పూర్తి చేసుకుని త్వరలో మిమ్మల్ని చూసేందుకు వస్తానని చెప్పాను. కానీ, తరువాత కొన్ని నిమిషాల పాటు ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా" అని కమల్ తెలిపారు.