: వాజ్ పేయికి భారతరత్న... 25న ప్రకటించే అవకాశం!
భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించేందుకు నరేంద్ర మోదీ సర్కారు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న అటల్ జీ 90వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు స్వయంగా ప్రకటన చేయనున్నారని సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం సాగింది. బీజేపీ తరపున తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పిన వాజ్ పేయి సచ్ఛీలతకు నిదర్శనంగా ఆయన జన్మదినాన్ని సుపరిపాలన దినంగా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అవినీతి రహిత పాలనను అందించిన వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలని పార్టీ నేతలు మురళీమనోహర్ జోషి, హేమమాలిని సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మిత్రపక్షం శివసేన కూడా ఈ విషయంలో తన మద్దతు ప్రకటించింది. ఇటీవల భారతరత్న పురస్కారాల ప్రకటనలో యూపీఏపై నిప్పులు చెరిగిన బీజేపీ, వాజ్ పేయి వారి కంటికి కనిపించలేదా అంటూ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న వాజ్ పేయికి భారతరత్న పురస్కారం ప్రకటన వెలువడటం ఖాయంగానే కనిపిస్తోంది.