: డెత్ సర్టిఫికేట్ అడిగితే చెప్పుతో కొట్టండి: వితంతువులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచన
ఆసరా పింఛన్ల నిబంధనలపై వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. భర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం అడిగే రెవెన్యూ అధికారులను చెప్పుతో కొట్టండని ఆయన వితంతువులకు సూచించారు. సోమవారం గీసుకొండ మండలం ధర్మారంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన ముందు వితంతువులు తమ ఇబ్బందులను ఏకరవు పెట్టారు. ఎప్పుడో చనిపోయిన భర్తకు సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చేదంటూ వారు ఆయన ముందు వాపోయారు. బాధితురాలి భర్త చనిపోయినట్లు సర్పంచ్ ధ్రువీకరిస్తే సరిపోతుందని, ఈ మేరకు ఆసరా పింఛన్ల నిబంధనలను మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయినా శాంతించని వితంతువులు రెవెన్యూ అధికారుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయనను ముందుకు కదలనీయలేదు. ఈ సందర్భంగా కాస్త అసహనానికి గురైన ఎమ్మెల్యే, మిమ్మల్ని డెత్ సర్టిఫికేట్ అడిగే రెవెన్యూ అధికారులను చెప్పుతో కొట్టండంటూ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.