: కేంద్రం వైఖరికి నిరసనగా దీదీ మరో ర్యాలీ
శారదా చిట్ ఫండ్ కేసులో పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా అరెస్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతున్నారు. మిత్రా అరెస్టుకు నిరసనగా ఆదివారం భారీ ర్యాలీని నిర్వహించిన దీదీ, తాజాగా సోమవారం కూడా మరో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారంలో మొదటి రోజైన సోమవారం ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ పక్కనపెట్టేసిన మమత, కేంద్రం కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కోల్ కతాలోని గోస్తో పాల్ సరానీ నుంచి మొదలైన ఈ ర్యాలీ పార్క్ స్ట్రీట్ మీదుగా తిరిగి ప్రారంభమైన చోటే ముగియనుంది. ఈ ర్యాలీకి భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. ఆదివారం దీదీ నివాసంలో జరిగిన తృణమూల్ కోర్ కమిటీ భేటీలో నిరసనలను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే తమ పార్టీకి శారదా చిట్ ఫండ్ మకిలిని కేంద్రం అంటిస్తోందని మమత ఆరోపిస్తున్నారు. నిందితులతో ఫొటోలు దిగినంత మాత్రాన నేరస్థులైతే, సహారా చీఫ్ సుబ్రతో రాయ్ తో ఫొటో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరస్థుడేనని ఆమె వాదిస్తున్నారు.