: ఏపీకి బయోకాన్, తెలంగాణకు దుబాయ్... పెట్టుబడుల వెల్లువ!
తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడుల వరద పారుతోంది. నిన్నటిదాకా ఏపీ కాస్త మెరుగైన పనితీరు కనబరచినా, తాజాగా తెలంగాణ కూడా స్పీడు పెంచింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం దుబాయ్ కి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, అవకాశాలు తదితరాలను వివరించిన ఆయన వారి నుంచి సానుకూల స్పందనను రాబట్టగలిగారు. నేడు, రేపు కూడా ఆయన అక్కడే తిష్ట వేయనున్నారు. మొత్తం మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గణనీయ ఫలితాలనే రాబట్టే అవకాశాలున్నాయి. ఇక పెట్టుబడులను ఆకర్షించడంలో తనదైన శైలిలో దూసుకెళుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. దేశంలోనే అగ్రగామి ఫార్మా కంపెనీ బయోకాన్ తనకు తానుగా పెట్టుబడులు పెడతానంటూ ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా, చంద్రబాబుతో భేటీ అయ్యారు. విశాఖలో తమ కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ప్రతిపాదించారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, అడగకున్నా పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన బయోకాన్ కు రెడ్ కార్పెట్ పరిచారు. కంపెనీకి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పిన ఆయన మరిన్ని ప్రోత్సాహకాలను కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.