: గూఢచారులకు దొరికిన దావూద్ ఇబ్రహీం... చంపవద్దని చెప్పిన భారత అదృశ్యశక్తి!
దావూద్ ఇబ్రహీం... ఇండియాకు మోస్ట్ వాంటెడ్, 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, చీకటి సామ్రాజ్యపు అధినేత. అటువంటి వ్యక్తి మన గూఢచారుల తుపాకుల చేతికి చిక్కగా, ఓ అదృశ్యశక్తి కల్పించుకొని దావూద్ ఇబ్రహీంను చంపవద్దని చెప్పిందట. ఇది జరిగి దాదాపు 15 నెలలు అవుతోంది. 2013 సెప్టెంబర్ 13న పాకిస్థాన్‌లోని కరాచీ పరిధిలోని క్లిప్టన్ రోడ్ నుంచి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీకి వెళ్ళే మార్గంలో దావూద్ వస్తున్నాడని, అతనిని హతమార్చాలని 9 మంది ‘రా’ కమాండోలు కాచుకుకూర్చున్నారు. మరి కొన్ని నిమిషాల్లో దావూద్ కారు అటువైపు రానున్న సమయంలో ఇండియా నుంచి వచ్చిన ఓ ఫోన్లో ‘‘ఆపరేషన్ ఆపేయండి... ఆ వ్యక్తిని వదిలేయండి’’ అని ఓ స్వరం ఆదేశించింది. పదేపదే తప్పించుకుంటున్న దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు భారత నిఘావర్గాలు అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టి 'సూపర్‌బాయ్స్' పేరిట 9 మందిని ఎంపిక చేయగా, వీరంతా, సూడాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ నిఘా విభాగం సహకారంతో దావూద్ కదలికలను పసిగట్టిన సూపర్‌బాయ్స్ గతేడాది సెప్టెంబర్ 13న ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. దావూద్ ను షూట్ చేయడం ద్వారా, రెండు దశాబ్దాల భారత కల నెరవేరే సమయంలో వెనక్కి వచ్చేయాలని వారికి ఆదేశాలు అందాయి. అయితే, దావూద్ ప్రాణాలను కాపాడిన ఆ భారత నేత లేదా అధికారి ఎవరో?!