: మూసీనది నీటితో పండిన కూరగాయలు తింటున్నారా?...అయితే మీకు మూడినట్టే!


హైదరాబాదులో నివాసం ఉంటున్నారా?...మూసీ నది నీటితో పండించిన కూరగాయలు తింటున్నారా? అయితే మీకు మూడినట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మూసీ నది నీటితో పండించిన కూరగాయల్లో ప్రమాదకర రసాయనాలు అర్సెనిక్, లెడ్, కాడ్మియం, వంటి అవశేషాలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో మూసీ ఒడ్డున పండే కూరగాయలపై ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర రీసెర్చ్ స్కాలర్ సుచిత్ర బృందం పలు పరిశోధనలు నిర్వహించింది. వంకాయ, టమోటా, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయ పంటలను పండించి, వాటి ఫలితాలను విశ్లేషించింది. ఈ పంటలను పండించేందుకు 3 రకాల నీటిని (1. మూసీ నీరు, 2.బోరు నీరు, 3. శుద్ధి చేసిన మూసీ నీరు) వినియోగించారు. కొద్ది నెలల తర్వాత మూసీ నీటితో పండించిన పంటల్లో కాపర్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం వంటి అత్యంత ప్రమాదకర విష రసాయన మూలకాలను గుర్తించారు. వాటి కంటే కూడా ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్ (సీసం), బెరీలియం, కాడ్మియం వంటి భార లోహాల ఆనవాళ్లను కూడా వారు పసిగట్టారు. బోరు నీటితో పండిన టమోటాలో కాపర్ 0.76 మిల్లీగ్రాములు (ఎంజీ) నమోదు కాగా, మూసీ నీటితో పండిన టమోటాలో అది 3.75 ఎంజీగా నమోదైంది. అలాగే క్యారెట్‌ లో సాధారణ నీటితో 0.31 ఎంజీ కాపర్ ఉండగా, మూసీనీటితో పండిన క్యారెట్ లో కాపర్ శాతం 2.71 ఎంజీగా నమోదైంది. బోరు నీటితో పండించిన మిరపలో 1.01 ఎంజీ కాపర్ నమోదు కాగా, మూసీనీటితో పండించిన మిరపలో 2.26 ఎంజీ ఉంది. అయితే కార్పోహైడ్రేట్ల విషయంలో మాత్రం తల్లకిందులవ్వడం విశేషం. బోరు నీటితో పండించిన వంకాయ పంటలో కార్బోహైడ్రేట్ల స్ధాయి 2.83 ఎంజీ ఉండగా, మూసీనీటి పంటలో మాత్రం 2.35 గా నమోదైంది. మూసీ నది నీటితో పోచంపల్లి చీరకు రంగులు అద్దితే అవి ఎగుమతి నిరాకరణకు గురయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఈ నీరు కలిసిన జలాల్లో చేపలు అకారణంగా మృత్యువాతపడుతుండడం విశేషం.

  • Loading...

More Telugu News