: భారత్, ఆస్ట్రేలియా మధ్య అది సహజమే: రహానే
అడిలైడ్ టెస్టు చివరి రోజున టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే సహనమే కీలకమని అభిప్రాయపడ్డాడు. ఐదోరోజు ఆటలో ఓపికతో ఆడాల్సి ఉంటుందని అన్నాడు. తాజా సవాలు మానసిక సన్నద్ధతకు పరీక్ష వంటిదని పేర్కొన్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ నైపుణ్యం ఉన్న వారని చెబుతూ, చివరి రోజు ఆటలో అందరూ రాణిస్తారని ధీమాగా చెప్పాడు. వ్యక్తిగతంగానూ, సమష్టిగానూ రాణించాల్సిన తరుణమని తెలిపాడీ ముంబైవాలా. నాలుగో రోజు ఆటలో చోటు చేసుకున్న మాటల యుద్ధంపై మాట్లాడుతూ, అంపైర్లిద్దరూ ఆ వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించారన్నాడు. క్రికెట్ లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నాడు. ముఖ్యంగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య స్లెడ్జింగ్ సహజమేనని అభిప్రాయపడ్డాడు. ఓ రకంగా ఇది క్రికెట్ కు మంచిదేనన్నాడు. ఇక, చివరి రోజు భారత్ కు ఇబ్బందులు సృష్టించగలడని భావిస్తున్న లియాన్ గురించి మాట్లాడుతూ, అతనో అనుభవజ్ఞుడైన బౌలర్ అని తెలిపాడు. గతంలో అతని ప్రదర్శన బాగానే ఉన్నా, తాము వర్తమానంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని అన్నాడు.