: అడిలైడ్ టెస్టులో పట్టు బిగించిన ఆసీస్
అడిలైడ్ టెస్టులో ఆసీస్ పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 290 పరుగులు చేసిన ఆసీస్ ఓవరాల్ ఆధిక్యాన్ని 363కు పెంచుకుంది. ఆటకు మరొక్క రోజు మిగిలున్న నేపథ్యంలో, శనివారం ఉదయం తొలి సెషన్ ఆరంభంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ కు బ్యాటింగ్ అప్పగించే అవకాశాలున్నాయి. ఇక, ప్రతి సెషన్ టీమిండియాకు కీలకమే. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగినప్పుడు భారత జట్టు వికెట్లు చేజారకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ విజయంపై ఆశల్లేకపోయినా... డ్రా చేసుకోవాలంటే తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, నాలుగో రోజు ఆటలో సెంచరీ సాధించిన కంగారూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (102) మరోసారి తన బ్యాటింగ్ సత్తా రుచి చూపాడు. వార్నర్ కు తోడు స్మిత్ , మార్ష్ (40) కూడా రాణించడంతో ఆసీస్ మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. వార్నర్ తొలి ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించడం తెలిసిందే. క్రీజులో స్మిత్ (52 బ్యాటింగ్), వికెట్ కీపర్ హాడిన్ (14 బ్యాటింగ్) కాగా, భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. షమీ, ఆరోన్, పార్ట్ టైమర్ రోహిత్ శర్మ తలో వికెట్ సాధించారు. అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 444 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో 10 పరుగులు జోడించిన రోహిత్ శర్మ (43) ఆఫ్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 399/6. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో వికెట్ కీపర్ సాహా (25) షమీ (34) బ్యాట్లకు పనిచెప్పడంతో ఆసీస్ ఆధిక్యం కాస్త తగ్గింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.