: మరో ప్రాణం బలైంది... వీడియో విడుదల చేసిన ఐఎస్ఐఎస్


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు మరోసారి ఘాతుకానికి తెగబడింది. పాశ్చాత్య దేశాలకు చెందిన పాత్రికేయులు, స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకర్తల ప్రాణాలను బలిగొంటూ అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతున్న ఈ రాకాసి మూక తాజాగా పీటర్ కాసిగ్ (26) అనే అమెరికా జాతీయుడి గొంతు కోసి చంపేసింది. దీని తాలూకు వీడియోను ఆన్ లైన్ లో పెట్టింది. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో, రక్తమోడుతున్న ఓ తల పక్కనే ముసుగు ధరించిన మిలిటెంట్ కనిపించాడు. ఆ తలను కాసిగ్ దని పేర్కొన్నాడా మిలిటెంట్. అంతేగాకుండా, సిరియా సైనికుల సామూహిక వధను కూడా ఈ వీడియోలో పొందుపరిచారు. కాగా, ఐఎస్ఐఎస్ చేతిలో ప్రాణాలు వదలిన అమెరికన్లలో కాసిగ్ మూడోవాడు. ఓవరాల్ గా ఐదవ పాశ్చాత్యుడు. గత అక్టోబరులో బ్రిటీష్ కార్యకర్త అలెన్ హెన్నింగ్ ను చంపిన సందర్భంగా విడుదల చేసిన వీడియో చివర్లో పీటర్ కాసిగ్ ను ప్రదర్శించారు. తర్వాతి వంతు అతనిదేనని ఆ వీడియోలో ప్రకటించారు. కాసిగ్ ను విడుదల చేయాలంటూ అతని తల్లిదండ్రులు పలుమార్లు ఐఎస్ఐఎస్ ను వేడుకున్నారు. కానీ, ఆ ముష్కరులు కనికరించలేదు.

  • Loading...

More Telugu News