: అజ్మల్ ను వన్డే బరిలో దించాలని పీసీబీ యోచన
ఐసీసీ సస్పెన్షన్ వేటుకు గురైన పాకిస్థాన్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను కెన్యాతో వన్డేల్లో బరిలో దించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తోంది. చెన్నైలో నిర్వహించే ఆఖరి బయోమెకానిక్స్ పరీక్షకు ముందే అజ్మల్ ను మ్యాచ్ లు ఆడించాలన్నది పీసీబీ ప్లాన్. ఒకటి, లేక, రెండు మ్యాచ్ లలో అజ్మల్ ను బరిలో దించాలని భావిస్తున్నామని బోర్డు అధికారి షకీల్ షేక్ తెలిపారు. పాక్ జట్టు కెన్యాతో ఆడనున్నది అంతర్జాతీయ సిరీస్ కాదు. ఐసీసీ సస్పెన్షన్ నిర్ణయం అంతర్జాతీయ మ్యాచ్ లకే వర్తిస్తుంది. కెన్యాతో సిరీస్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల కిందే పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే అజ్మల్ కు మ్యాచ్ ప్రాక్టీసు కల్పించాలని పీసీబీ నిర్ణయించింది. తాము, బయోమెకానిక్స్ పరీక్ష నిమిత్తం అజ్మల్, హఫీజ్ లను చెన్నైలో ఉన్న ఐసీసీ అనుబంధ ల్యాబ్ కు పంపుతామని షకీల్ స్పష్టం చేశారు. అక్రమ బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నాడంటూ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ పైనా ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే.