: టెర్రరిస్టు చట్టం కింద ఇమ్రాన్ పై కేసు నమోదు
పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై టెర్రరిస్టు చట్టం కింద కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్ న్యాయ శాఖ మాజీ మంత్రి రాణా సనావుల్లాకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారంటూ ఆయనపై కేసు రిజిస్టర్ అయింది. తాను పాల్గొన్న సభ వద్ద ఇమ్రాన్, మరికొందరు దాడులకు ఉసిగొల్పారని సనావుల్లా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, ఇమ్రాన్ తో పాటు పీటీఐ నేతలు షా మహమూద్ ఖురేషి, ఆరిఫ్ అల్వీ, అసద్ ఉమర్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ అవామీ చీఫ్ షేక్ రషీద్ పైనా కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ తదితరులు తన నివాసంపై దాడి చేయాలని ఆందోళనకారులకు పిలుపునిచ్చారని సనావుల్లా తెలిపారు. గతేడాది ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఇమ్రాన్ వర్గం కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.