: ఓటర్ల నమోదు గడువు పొడిగింపు
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. గత నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు చేయనున్నామని, పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. దరఖాస్తులను, అభ్యంతరాలను 28వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు వివరించారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటిస్తామన్నారు. ‘సీఈవోఆంధ్రా, సీఈవోతెలంగాణ’ వెబ్ సైట్ల ద్వారా కూడా ఓటర్‌గా నమోదుచేసుకోవచ్చన్నారు.