: కోహ్లీ, శాస్త్రి ఆత్మవిశ్వాసం అందించారంటున్న కొత్త బౌలర్
అడిలైడ్ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్ గడప తొక్కిన భారత యువ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో శర్మ 23 ఓవర్లు విసిరి ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను బలిగొన్నాడు. కాగా, తొలి రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి పలికిన ప్రోత్సాహక వచనాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయని చెప్పుకొచ్చాడు. తాను తుది జట్టులో ఉన్న విషయాన్ని మంగళవారం ఉదయమే చెప్పారని తెలిపాడు. సాంకేతికంగా, మానసికంగా రవిశాస్త్రి ఎంతో తోడ్పాటు అందించారని, ఇతర కోచింగ్ సిబ్బంది కూడా సాయపడ్డారని శర్మ పేర్కొన్నాడు. ఇక, కెప్టెన్ కోహ్లీ... బౌలింగ్ తీరు, బంతులు విసరాల్సిన లైన్, ఫీల్డింగ్ ప్లేస్ మెంట్లు వంటి అంశాలపై తనతో మాట్లాడాడని ఈ యూపీ లెగ్ స్పిన్నర్ వివరించాడు. సాధారణంగా తాను లైన్ అండ్ లెంగ్త్ కు ప్రాధాన్యత ఇస్తానని, వన్డే క్రికెట్, టి20 ఫార్మాట్లో అలాగే బౌలింగ్ చేసి సత్ఫలితాలు రాబట్టానని చెప్పాడు. ఇక, తొలి టెస్టు విషయానికొస్తూ, వార్నర్ వికెట్ పడగొట్టడం ద్వారా కీలక భాగస్వామ్యాన్ని విడదీయడం సంతోషాన్నిచ్చిందని అన్నాడు. అరంగేట్రం టెస్టులో 18వ ఓవర్లోనే బౌలింగ్ చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురయ్యారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, దేశవాళీ క్రికెట్ తరహాలోనే బౌలింగ్ కు ప్రయత్నించానన్నాడు.