: అరుణగ్రహంపై నీటి ఆనవాళ్లు
అరుణగ్రహంపై నీటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో, అరుణ గ్రహంపై జీవం ఉండేందుకు ఒకప్పుడు అనుకూల వాతావరణం ఉండేదన్న వాదనలకు బలం చేకూరుతోంది. అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ నీటి జాడలను కనిపెట్టిందని భారత సంతతి శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. భూగ్రహం మాదిరిగానే ఒకప్పుడు అరుణ గ్రహం కూడా సూక్ష్మజీవులకు ఆవాసయోగ్యంగా ఉండేదని వారు వెల్లడించారు. సరస్సులలోకి నీరు ప్రవహించినట్టుగా జాడలు ఉన్నట్టు క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ద్వారా స్పష్టమవుతోందని వారు తెలిపారు. అంగారక గ్రహంలోని మౌంట్ షార్ప్ లోని శిలలు కొన్ని వేల లక్షల ఏళ్లు నీటిలో నిక్షిప్తమైన లక్షణాలు కలిగి ఉన్నట్టు వారు వివరించారు. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలితాలనిస్తున్నట్టే కనపడుతోంది. అయితే, అరుణ గ్రహంపై గతంలో నీరు ఉండి ఉంటే, అక్కడ జీవం ఉండేదనడానికి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావు. అలాగే భవిష్యత్ లో మానవులు ఆవాసయోగ్యమైన మరో గ్రహం కోసం చేస్తున్న అన్వేషణ ఫలించినట్టే.