: ఓటమి మాకు కొత్తేమీ కాదుగా!: టీపీసీసీ చీఫ్ పొన్నాల
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ నేతలను వైరాగ్యం ఆవరించినట్లుంది. లేకపోతే, అధికారంలోకి రాకపోవడం మాకు కొత్తేమీ కాదుగా? అంటూ వారు ఎందుకు వ్యాఖ్యానిస్తారు చెప్పండి. అదీ సాక్షాత్తు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ పొన్నాల నోటి నుంచి ఈ తరహా ప్రకటన వస్తే ఇంకేమన్నా ఉందా? వైరాగ్యమో, ఓటమిని అంగీకరించడమో... ఏదైతేనేం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నేడు ఇదే వ్యాఖ్య చేశారు. అది కూడా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. గడచిన ఎన్నికల్లో తమతో పాటు ఆయా పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టాను వల్లించిన వైనాన్ని వివరిస్తున్న సందర్భంగా, సాధ్యమయ్యే హామీలను ఇచ్చిన తమను ప్రజలు ఓడించారన్నారు. అదే సమయంలో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చిన వారిని ప్రజలు గెలిపించారన్నారు. అదే క్రమంలో ప్రసంగిస్తూ పోయిన ఆయన ‘‘అధికారంలోకి రాకపోవడం (పరాజయం పాలు కావడం) తమకు కొత్తేమీ కాదు’’ అని వ్యాఖ్యానించారు.