: మళ్లీ బౌన్సర్ విసిరిన అబాట్


తాను విసిరిన బౌన్సర్ ప్రాణాలను బలిగొంటుందని ఆసీస్ యువ ఫాస్ట్ బౌలర్ షాన్ అబాట్ ఊహించి ఉండడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ బౌన్సర్ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ పాలిట మృత్యువులా పరిణమించింది. దీంతో, అబాట్ కొన్నిరోజుల పాటు అపరాధ భావనతో కుంగిపోయాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లందరూ అతనికి బాసటగా నిలిచారు. "నీ తప్పేమీ లేదు, ఆటలో అలా జరిగిపోయిందంతే" అంటూ అనునయించారు. ఈ నేపథ్యంలో, మరోసారి మైదానంలో అడుగుపెట్టాడీ యువ స్పీడ్ స్టర్. హ్యూస్ నేలకొరిగిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోనే బంతి పట్టాడు. న్యూ సౌత్ వేల్స్-క్వీన్స్ లాండ్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ 13 ఓవర్ లో అబాట్ బౌలింగ్ కు దిగాడు. ఆ ఓవర్లో ఓ బౌన్సర్ కూడా విసిరి తన దృక్పథాన్ని చాటాడు. తొలి నాలుగు బంతులను డాట్ బాల్స్ గా విసిరి బ్యాట్స్ మన్ జో బర్న్స్ ను కట్టడి చేశాడు. కాగా, ఈ మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ ఆటగాళ్లు హ్యూస్ కు నివాళిగా 'పీజేహెచ్ 707' అని ముద్రించి ఉన్న జెర్సీలను ధరించారు. న్యూ సౌత్ వేల్స్ జట్టుకు హ్యూస్ గతంలో ఓ సారి ప్రాతినిధ్యం వహించాడు. ఆ రాష్ట్రం తరపున ఆడిన 707వ క్రికెటర్ హ్యూస్ కావడంతో అదే నెంబర్ ను జెర్సీలపై ముద్రించారు.

  • Loading...

More Telugu News