: ఏపీ రాజధాని కోసం బృహత్ ప్రణాళిక ఇస్తాం: ఈశ్వరన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం బృహత్ ప్రణాళిక ఇస్తామని సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ తెలిపారు. హైదరాబాదులో ఏపీ రాజధానిపై సీఎం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని అన్నారు. భవిష్యాంధ్రప్రదేశ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి అమోఘమని ఆయన కితాబునిచ్చారు. రాజధాని బృహత్ ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. గడువులోగా రాజధానిపై బృహత్ ప్రణాళిక అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ సంస్థలు కలిసి పని చేస్తాయని ఆయన చెప్పారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.