: 'మేము సైతం'కి రాలేకపోయినందుకు క్షమించండి... లింగా బాగుంది...రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్: రజనీకాంత్
విశాఖపట్టణంలో సంభవించిన హుదూద్ తుపాను బాధితుల కోసం జరిగిన 'మేము సైతం' కార్యక్రమంలో ఓ పెళ్లి కారణంగా పాల్గోలేకపోయానని, అందుకు తనను క్షమించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. హైదరాబాదులోని నోవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, హుదూద్ బాధితులను ఆదుకునేందుకు తనకు చేతనైనంత సాయం ఆందజేస్తానని చెప్పారు. తాను నాలుగున్నర ఏళ్ల విరామం తరువాత లింగా సినిమాలో నటించడం జరిగిందని అన్నారు. ఈ సినిమాలో చాలా అద్భుతాలు జరిగాయని ఆయన వివరించారు. ఆరునెలల్లో సినిమా తీయడం ఓ అద్భుతమైతే, సినిమాని ఇంత తక్కువ సమయంలో తీయడం మరో అద్భుతమని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా సబ్జెక్ట్ చాలా పెద్దదని, అలాంటి దాన్ని 65 రోజుల్లో తీయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనతలో నటించేవారిదేమీ లేదని, ఆ క్రెడిట్ మొత్తం సినిమా దర్శకుడు, యూనిట్, నిర్మాతదేనని ఆయన చెప్పారు. ఈ సినిమాలో మూడు సర్ ప్రైజ్ లున్నాయని ఆయన తెలిపారు. అవేమిటో సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ 12న సినిమా విడుదలకు ఉండగా, నలుగురు వ్యక్తులు ఈ సినిమా కథ తమదంటూ కేసు వేశారని అన్నారు. అయితే ఈ సినిమా ఆ నలుగురిది కాదని, దర్శకుడిదేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ సినిమా తనకు నచ్చిందని, అభిమానులకు కూడా నచ్చుతుందని రజనీ తెలిపారు. తాను ఈ సినిమాలో చాలా కష్టపడి నటించానని ఆయన అన్నారు. హీరోయిన్లిద్దరితో డ్యూయెట్లు చేసేటప్పుడు చాలా కష్టపడ్డానని రజనీ చమత్కరించారు. ఓ ఆర్టిస్టుకి ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదని ఆయన వివరించారు. 60 ఏళ్ల తరువాత కూతురులాంటి అమ్మాయితో డ్యూయెట్ చేయమంటారా? అని ఆయన ప్రశ్నించారు. తన కుమార్తెలతోనే సోనాక్షి పెరిగి పెద్దదైందని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాను 65 రోజుల్లో నిర్మించగలమని యువకులు తెలుసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 'బాహుబలి'ని గురించి అలా అనుకోకండని ఆయన సూచించారు. ఎందుకంటే, ఆ సినిమా ఓ అద్భుతమని ఆయన చెప్పారు. రాజమౌళి భారత దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అని చెప్పిన రజనీ, తనకు నటించే అవకాశం వస్తే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తానని హామీ ఇచ్చారు. కేఎస్ రవికుమార్ ఈ సినిమాని అద్భుతంగా తీశారని ఆయన కితాబిచ్చారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ అద్భుతమైన మనిషని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమలో జగపతిబాబు మంచి మనిషని ఆయన పేర్కొన్నారు. తమిళ జనాల్లాగే తెలుగు ప్రజలు కూడా తనను ఆది నుంచీ ఆదరిస్తున్నారని పేర్కొన్న ఆయన, ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని అన్నారు. చివర్లో అల్లు అరవింద్ తనతో సినిమా తీయడం కంటే ముందే చిరంజీవితో చేయాలని రజనీ సూచించారు.