: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా కేసీఆర్!
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చురుగ్గా పాలుపంచుకున్న కేసీఆర్, నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్న కేసీఆర్, వాటి పరిష్కారం కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని, చేయూతనందించాలని ఈ సందర్భంగా కేంద్రం ముందు తమ ప్రతిపాదనలను పెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు విద్యుత్, జలవనరుల శాఖ మంత్రులు పియూష్ గోయల్, ఉమా భారతిలతో ఆయన నేడు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుతో తమకు ఎదురవుతున్న సమస్యలను కేసీఆర్, కేంద్ర మంత్రుల ముందు ఉంచనున్నారు. అంతేకాక కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ ప్రత్యేక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు కూడా కేసీఆర్ యత్నించనున్నారు.