: తెలంగాణ నేతలు, ప్రభుత్వంపై కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊది, అన్నీ తానై, రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని వాడుకునే నేతల చర్యలను అడ్డుకుంటామని పరోక్షంగా టీఆర్ఎస్ కు హెచ్చరికలు పంపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాము పోరాటం చేశామని... నాయకుల కోసం కాదని స్పష్టం చేశారు. నాయకులు, ప్రభుత్వాల ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో లొంగనని తెలిపారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలోనే తన భవిష్యత్తు ఏమిటో తనకు క్లియర్ గా తెలుసని... రాష్ట్రం వచ్చిన తర్వాత నాయకులు తనను దగ్గరకు రానివ్వరని ముందే ఊహించానని మనసులోని మాటను బహిర్గతం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తన జీవితం మొత్తం అంకితమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు సిసలైన ఉద్యమ నేత కోదండరామ్ ను టీఆర్ఎస్ నేతలు పలకరించిన పాపాన కూడా పోలేదన్న సంగతి తెలిసిందే.