: మంచినీరు దొరక్క మాలే ప్రజల అవస్థలు... విమానాల్లో నీరు పంపిన ఇండియా
మాల్దీవులలో మంచి నీటిని సరఫరా చేసే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగటంతో, దేశ రాజధాని మాలేలో సుమారు లక్ష మంది ప్రజలు తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు సహాయం చేయాలని ఇండియా, శ్రీలంక, చైనా దేశాలకు మాల్దీవుల ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం, తక్షణం 5 పెద్ద రవాణా విమానాల్లో మంచి నీటిని పంపుతున్నట్టు ప్రకటించింది. హిందూ మహాసముద్రంలోని చిన్న దీవుల సముదాయంగా ఉన్న మాల్దీవులలో సముద్రపు నీటినే శుద్ధి చేసుకొని వాడుకుంటారు. మాలేలో ప్రభుత్వమే ఉచితంగా ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తుంది. నీటి శుద్ధి కేంద్రంలో అన్ని పరికరాలు పాడు కావడం, వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో మరికొన్ని రోజుల పాటు నీటి కష్టాలు తప్పవని ఆ దేశ మంత్రి షరీఫ్ తెలిపారు.