: సాకర్ టీం కెప్టెన్ ను కొట్టి చంపిన ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్
లాటిన్ అమెరికా దేశాల్లో సాకర్ అంటే పిచ్చి! ఎంతంటే... తాము అభిమానించే జట్టు ఓటమిపాలైందంటే స్టేడియంలో విధ్వంసం తప్పదు! కుర్చీలు విరిగిపోతాయి, స్టాండ్లు కుప్పకూలిపోతాయి! కొన్నిసార్లు వారి ఆవేశం శృతిమించి, ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతుంటాయి. తాజాగా, అర్జెంటీనాలో అలాంటి ఘటనే జరిగింది. దారుణం అనదగ్గ ఈ ఘటనలో ఓ సాకర్ టీం కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు. థర్డ్ టైర్ లీగ్ పోటీల్లో భాగంగా టిరో ఫెడరల్, చకారిటా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆటగాళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో, ఆట 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఏదోలా మ్యాచ్ పూర్తయింది. ఆ తర్వాతే అసలు రగడ మొదలైంది. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఓ ఆటగాడు, కొందరు ఫ్యాన్స్ తో కలిసి వచ్చి... టిరో ఫెడరల్ జట్టు కెప్టన్ ఫ్రాంకో నీటోపై దాడి చేశాడు. ఆ దాడిలో చకారిటా జట్టు అసిస్టెంట్ కోచ్ తో పాటు ఓ గూండా కూడా పాల్గొన్నాడు. ఈ దాడిలో నీటో తలకు బలమైన గాయాలయ్యాయి. శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ, అతడు ప్రాణాలు విడిచాడు.