: జీహాదీల చేతుల్లో పాక్ యుద్ధ నౌకలు... బుద్ధి చెబుతామంటున్న నేవీ చీఫ్!
పాకిస్తాన్ యుద్ధ నౌకలను వాడుకొని భారత్ పై దాడులు జరపాలని జీహాదీలు భావిస్తున్నారని, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు నౌకా దళం అనునిత్యం సిద్ధమని చీఫ్ అడ్మిరల్ రాబిన్ దోవన్ తెలిపారు. నేడు నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్ లో పాకిస్తాన్ తేలికపాటి యుద్ధ నౌకలు పీఎన్ఎస్ అస్లత్, పీఎన్ఎస్ జుల్ఫీకర్ లను కరాచీ నుంచి దొంగిలించేందుకు అల్-ఖైదా ప్రయత్నించి విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ నౌకలను ఇండియా, యూఎస్ వార్ షిప్ లపై దాడులకు వినియోగించాలని ఉగ్రవాదులు భావించారని తెలిపారు. సముద్ర జలాల్లో పాకిస్తాన్ నౌకలను అనుమానంగా చూడటం ఇప్పుడు సాధారణంగా మారిందని ఆయన అన్నారు. మొత్తం 140 యుద్ధ నౌకలు భారత అమ్ముల పొదిలో ఉండగా, దాదాపు 75 నౌకలు హిందూ మహా సముద్రం ప్రాంతంలో మోహరించి నిఘా పెట్టాయని తెలిపారు. మన చుట్టూ ఉన్న వివిధ దేశాల పోర్టులలో చైనా కాలుమోపుతోందని, చైనా నేవీ చేస్తున్న కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని ఆయన వివరించారు.