: దేశ అభివృద్ధి లక్ష్యానికి మోదీ విదేశీ పర్యటనలు దోహదం చేస్తాయి: సుష్మా స్వరాజ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలపై లోక్ సభలో ఈరోజు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఓ ప్రకటన చేశారు. 'ఈ పర్యటనలు దేశ అభివృద్ధి లక్ష్యానికి సాయపడతాయి' అని భరోసా ఇచ్చారు. అంతేగాక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, దేశానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ప్రధాని విదేశీ పర్యటనలు దోహదం చేస్తాయని సభలో సుష్మ వివరించారు. మోదీ తన పర్యటనల్లో ఇంధనం, రక్షణ సహకారానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడంలో విజయం సాధించారని తెలిపారు. పర్యటన సమయంలో వివిధ దేశాల అధినేతలతో నల్లధనం అంశంపై కూడా ప్రధాని చర్చించారని తెలియజేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక వరుస విదేశీ పర్యటనలు చేసిన మోదీని 'ఎన్ఆర్ఐ పీఎం' అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలపై సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు.