: వేధింపురాయుళ్లకి ప్రవేశం లేదు: రోహ్ తక్ నిందితులకు సైన్యం షాక్
హర్యానాలోని రోహ్ తక్ లో అక్కాచెళ్లెళ్లను వేధింపులకు గురి చేసి, వారి చేతితో బెట్లు దెబ్బలు తిన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు నిందితులకు భారత సైన్యం షాకిచ్చింది. భారత సైన్యంలో చేరే క్రమంలో ఆ ఇద్దరు యువకులు రాత పరీక్షకు ఎంపికయ్యారు. అయితే వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో సోమవారం సైన్యం ఘాటుగా స్పందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడే వ్యక్తులను తాము ఏమాత్రం సహించబోమని ప్రకటించిన సైన్యం, సైన్యం చేరే క్రమంలో వారి యత్నాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని ప్రకటించింది. బాలికలను వేధింపులకు గురి చేసిన సదరు వ్యక్తుల గురించి సైనికాధికారులకు రోహ్ తక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సమాచారాన్ని చేరవేసిన నేపథ్యంలో సైన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని నిందితుల తల్లిదండ్రులు చేసిన వినతిని బాధిత బాలికలు తిరస్కరించారు.