: ఏపీ సీఎం చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్ లు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మరో రెండు కాన్వాయ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటిదాకా చంద్రబాబు సహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారంతా ఒకే కాన్వాయ్ తోనే పాలన సాగించారు. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో హైదరాబాదులోని కాన్వాయ్ నే ఆయా జిల్లాలకు తరలించేవారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకేసారి మూడు కాన్వాయ్ లను ఏపీ సీఎంకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా విజయవాడ పరిధిలో రాజధాని ఏర్పాటు కానుంది. దీంతో హైదరాబాద్ నుంచి అధికారిక కార్యకలాపాలు నెరపుతున్నా, తరచూ విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనే చంద్రబాబు ఎక్కువ కాలం గడుపుతున్నారు. దీంతో విజయవాడతో పాటు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలోనూ మరో రెండు కాన్వాయ్ లను ఆయన కోసం వినియోగించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఇందులో భాగంగా సఫారీ వాహనాలతో కూడిన ఓ అదనపు కాన్వాయ్ కోసం ప్రభుత్వం పూణెలోని ఓ సంస్థకు ఆర్డరిచ్చింది. ఈ కాన్వాయ్ మరో పది రోజుల్లోగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ కాన్వాయ్ ను విజయవాడ తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ కాన్వాయ్ డెలివరీ కాగానే పూణెలోని సదరు సంస్థకే మరో కాన్వాయ్ కోసం ఆర్డరిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరో నెల తర్వాత అందుబాటులోకి రానున్న కాన్వాయ్ ని అధికారులు తిరుపతికి తరలించనున్నారు.

  • Loading...

More Telugu News