: తల్లడిల్లిన పవన్ కల్యాణ్ కష్టం ఫలించింది... శ్రీజ కోలుకుంది!
అక్టోబర్ 17న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న శ్రీజను కలసిన సంగతి తెలిసిందే. మరణశయ్యపై ఉన్న శ్రీజ తనను కలవాలనే ఆకాంక్ష వెలిబుచ్చిందని తెలిసిన పవన్ కల్యాణ్, తూర్పుగోదావరి జిల్లా నగరం బాధితులను పరామర్శించేందుకు వెళ్లి, అక్కడి నుంచి అటే శ్రీజను చూసేందుకు వెళ్లాడు. కారు ఇబ్బంది పెట్టినా సరే వెనుదిరగకుండా పవన్ కల్యాణ్ ఆసుపత్రికి వెళ్లి శ్రీజను పరామర్శిచాడు. ఆమె చెవుల్లో 'శ్రీజా...శ్రీజా... నేను పవన్ కల్యాణ్ ను వచ్చాను' అంటూ పలకరించాడు. శ్రీజ నుంచి స్పందన లేకపోవడంతో అన్నెంపున్నెం ఎరుగని పసివారికి ఏంటీ కష్టం? అంటూ పవన్ కదిలిపోయాడు, కుమిలిపోయాడు, తల్లడిల్లి కన్నీరు పెట్టాడు. శ్రీజ చేయిపట్టుకుని పవన్ మాట్లాడేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, వెనుదిరుగుతూ 2 లక్షల రూపాయల చెక్కు, బొమ్మలు ఇచ్చాడు. దేవుడు కరుణించాడు. ఇప్పుడు శ్రీజ కోలుకుంది. ఇప్పుడు శ్రీజ పూర్తి ఆరోగ్యం సంపాదించుకుంది. నడుస్తోంది... భోజనం చేస్తోంది. త్వరలోనే డిశ్చార్జ్ కానుంది. వైద్యుల కష్టం, తల్లిదండ్రుల తపన, పవన్ ఫ్యాన్స్ ప్రార్థనలు, పవన్ కల్యాణ్ పరామర్శలోని గొప్పదనం కలిసి శ్రీజను బతికించాయని అతని ఫ్యాన్స్ అంటుండగా... తన కుమార్తెకు మనోధైర్యం కలిగించిన పవన్ కల్యాణ్ కు, శ్రీజకు వైద్యం చేసిన వైద్యులకు ధన్యవాదాలని ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.