: 'ప్రపంచంలో సందర్శించాల్సిన ఉత్తమ ప్రదేశాల' జాబితాలో హైదరాబాద్
రాజధాని నగరం హైదరాబాద్ పర్యాటకంగా మరింత పేరును సంపాదించుకుంటోంది. '2015లో ప్రపంచంలో సందర్శించాల్సిన ఉత్తమ ప్రదేశాల' జాబితాలో నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్స్ పబ్లికేషన్ మ్యాగజైన్ ఈ విషయాన్ని తెలిపింది. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించి, రెండవ స్థానంలో నిలిచిన ఏకైక నగరం ఇదే కావడం విశేషం. '2015లో ప్రపంచంలో చూడాల్సిన 20 ఉత్తమ ప్రదేశాల' పేరుతో నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ వార్షిక గైడ్ ను ప్రచురించింది. ఇందులో అమెరికాలోని ది ప్రెసిడియో ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రథమ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదును చివరిగా పాలించిన నిజాంగా పత్రిక పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, తాజ్ ఫలక్ నుమా, ఇరానీ కేఫ్ లు, ముత్యాల వ్యాపారం తదితర ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్ తరువాత స్థానాల్లో స్విట్జర్లాండ్ లోని జెర్మట్, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ వాల్, కోర్సిక, పెరూలోని చెక్వక్వరియో ఇలా ఇరవై నగరాలు జాబితాలో నిలిచాయి.