: తెలంగాణ జిల్లాల్లో డీడీఆర్సీల స్థానంలో డీపీసీలు
తెలంగాణ జిల్లాల్లో ఇకపై జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డీడీఆర్సీ) మాట వినిపించదు. అంతేకాక ఆయా జిల్లాల్లో ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల పెత్తనమూ ఉండబోదు. ఏ జిల్లాకు చెందిన మంత్రి ఆ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలు కల్పిస్తూ తెలంగాణ సర్కారు కొత్తగా జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ)లకు తెర లేపుతోంది. జిల్లాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి సొంత జిల్లాపై మంత్రులకు ఉన్న అవగాహన ఇతర జిల్లాలపై ఎలా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, డీడీఆర్సీల అధ్యక్షుడి హోదాలో జిల్లాకు వచ్చే ఇతర జిల్లాకు చెందిన మంత్రికి ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యేక కేటాయింపులు ఇవ్వాల్సి ఉంది. వీటిని సదరు మంత్రి స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు కేటాయిస్తారు. ఈ సందర్భంగా పలుమార్లు సొంత పార్టీ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఏ జిల్లాకు చెందిన మంత్రిని ఆ జిల్లాకే ఇన్ చార్జి మంత్రిగా నియమించాలన్న దిశగా యోచించిన ప్రభుత్వం డీపీసీలను తెరమీదకు తెచ్చింది.