: దెబ్బ చిన్నదే... ప్రభావం తీవ్రమైంది...హ్యూస్ మరణం వెనుక కారణం!
కోట్లాది మందిని అభిమానులుగా చేసుకున్న క్రికెట్ ఆటపై హ్యూస్ మరణం కొత్త చర్చను లేవదీసింది. హ్యూస్ కు తగిలిన బౌన్సర్ అంత తీవ్రమైనదా? బౌన్సర్ ధాటికే మరణించాడా? ఇంకేదైనా కారణముందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటన్నింటికీ సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి వైద్యులు స్పష్టమైన సమాధానమిచ్చారు. ఫిల్ హ్యూస్ ది అరుదైన కేసని వారు అభిప్రాయపడ్డారు. నవంబర్ 25న సిడ్నీ క్రికెట్ మైదానంలో దేశవాళీ జట్టుతో ఆడుతున్న సందర్భంగా షాట్ల ఎంపికలో జరిగిన తప్పిదంతో హ్యూస్ దవడకు కింది భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో హ్యూస్ షాక్ తిన్నాడు. తేరుకునే లోపే కిందిపడి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేసి అతనికి అరుదైన ప్రదేశంలో బంతి తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. మెడకు పక్కన ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి తగిలింది. దీంతో అది తీవ్రమైన ఒత్తిడికి గురై, నలిగిపోయింది. శరీరం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడంలో వెర్టెబ్రల్ ఆర్టెరీ కీలక పాత్రపోషిస్తుంది. ఇది నలిగిపోవడంతో మెదడుకు రక్తం సరఫరా జరగలేదు. ఇది అత్యంత ప్రమాదం. దీన్ని వైద్య పరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిసెక్షన్ అంటారని వైద్యులు వివరించారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, అతని మెదడుకు రక్తాన్ని సరఫరా పెంచేందుకు పుర్రెలో కొంత భాగం తొలగించామని అన్నారు. అనంతరం అతని మెదడుకు విశ్రాంతినిచ్చేందుకు అతనిని కోమాలోకి పంపారు. తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా అనంత లోకాలకు పయనమైపోయాడు. దీంతో క్రీడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. దిగ్భ్రాంతికి గురైంది!