: సరిహద్దు చొరబాట్లకు లేజర్ వాల్స్ తో అడ్డుకట్ట: బీఎస్ఎఫ్ యోచన
నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాకిస్థాన్ తోను; వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికులతోను నిత్యం చొరబాట్ల గుబులుతో కంటి మీద కునుకు వేయకుండా దేశాన్ని కాపాడుతున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సరికొత్త దిశగా ఆలోచనలు చేస్తోంది. ఎలాగూ ఇరు దేశాలతో సరిహద్దు వెంట కంచె ఉంది. ఈ కంచెకు బదులు లేజర్ వాల్స్ ను నిర్మిస్తే ఎలాగుంటుందని ఆ సంస్థ చీఫ్ డీకే పాఠక్ యోచిస్తున్నారు. అనుకున్నదే తడవుగా పాఠక్ తమ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టారు. మరోవైపు జమ్మూ, కాశ్మీర్ పరిధిలోని కొంత ప్రాంతంలో అసలు పెన్సింగ్ వేసేందుకు వీలుకాని పరిస్థితులకు కూడా లేజర్ వాల్స్ తో చెక్ పెట్టేయవచ్చని ఆయన తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పాఠక్ ప్రతిపాదనకు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసేసినట్లు సమాచారం. పాఠక్ ప్రతిపాదిస్తున్న లేజర్ వాల్స్ అందుబాటులోకి వస్తే, బీఎస్ఎఫ్ జవాన్లు కాస్త నింపాదిగా విధులు నిర్వర్తించవచ్చు. ఎందుకంటే, దేశ సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించాలనుకునే వ్యక్తి ఆ వాల్స్ ను టచ్ చేస్తూ రావాల్సిందే. మనిషి టచ్ కాగానే ఈ వాల్స్ అలారంను మోగించడంతో పాటు వారి జాడను పోలీసులకు చేరవేస్తాయి.