: పార్లమెంటు ఉభయసభల్లో నల్లధనంపై చర్చ ప్రారంభం
పార్లమెంటు ఉభయసభల్లో నల్లధనంపై చర్చ మొదలైంది. ముందుగా నల్లధనంపై కేంద్రం తీరును కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. నల్లధనం గురించి ప్రజలు తెలుసుకోవాల్సి ఉందని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. నల్లధనాన్ని వెనక్కు తెచ్చే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకువస్తే ఈ దేశంలో ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చన్న మోదీ మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు చాలా ప్రకటనలు చేశారన్న ఖర్గే, అప్పట్లో తాము (యూపీఏ) కావాలనే నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదని, వివరాలను దాచిపెట్టామని ఆరోపించారని చెప్పారు. అలా మాట్లాడిన వారంతా ఇప్పుడు చాలా మంది మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. ఇక తమకు ఓటు వేస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామన్న మోదీ హామీపైనే ఇప్పుడు తాము ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు.