: జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నా: ఓబులేసు


వారం క్రితం కేబీఆర్ పార్కు వద్ద పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించి పట్టుబడిన ఓబులేసు రిమాండ్ రిపోర్టు బయటికి వచ్చింది. దాని ప్రకారం ఓబులేసు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరి క్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని, అందుకే అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్లో విధులు నిర్వర్తించిన తాను ఏకే 47ను దొంగిలించింది కూడా అందుకేనని ఓబులేసు తెలిపాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని విచారణ సందర్భంగా అంగీకరించాడు. 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించి, ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలిపాడు. ప్రతిరోజూ కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం డబ్బున్న వాళ్లు, పెద్దపెద్ద కార్లలో రావడం గమనించేవాడినని ఓబులేసు తెలిపాడు. డ్రైవర్ లేని కారులో ఓనర్ ఎక్కిన తరువాత ఆ కారులో దూరి యజమానిని బెదిరించి డబ్బులు గుంజాలని పథకం వేసినట్టు ఒబులేసు తెలిపాడు. అందుకే నిత్యానందరెడ్డి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో కారులో దూరి, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. దీంతో అతడిని బంజారాహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనిని విచారణ చేసి, అతని రూంలో లభ్యమైన ఆరు రకాల తుపాకుల గుళ్లకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు.

  • Loading...

More Telugu News