: రాంపాల్ ఆశ్రమంలో బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కమెండో దుస్తులు
హర్యానాలోని వివాదాస్పద బాబా రాంపాల్ కు చెందిన సత్ లోక్ ఆశ్రమంలో సోదాలు జరుపుతున్న పోలీసులకు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కమెండో దుస్తులు దొరికాయి. ఆశ్రమంలోని లాకర్లను తెరిచి చూడగా, నాలుగు .315 బోర్ రైఫిళ్లు, అయిదు .12 బోర్ తుపాకులు, కొన్ని కాట్రిడ్జ్ లు దొరికాయని, మూడు బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కొన్ని కమెండో డ్రెస్ లు ఉన్నాయని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ చెప్పారు. కాగా, ఆశ్రమంలో దొరికిన ఆయుధాల గురించి ప్రశ్నించేందుకు, మూసి ఉన్న లాకర్లను తెరిపించేందుకు బాబా రాంపాల్‌ను పోలీసులు ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమ ఆవరణలోని లాకర్లు, అల్మరాల గురించి రాంపాల్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. మేజిస్ట్రేట్ సమక్షంలో లాకర్లను తెరిచినట్లు వారు తెలిపారు. దాదాపు గంటసేపు ఆశ్రమంలో ఉండిన రాంపాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించిందని వశిష్ట్ తెలిపారు. రాంపాల్ అనుచరులు పోలీసులతో ముఖాముఖి తలపడడానికి సిద్ధపడ్డారని భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఏకే రావు తెలిపారు. ఆశ్రమంలో కొంత నగదు దొరికిందని, సోదాలు పూర్తయిన తర్వాత ఎంత దొరికిందో లెక్క వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.