: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు...పలువురు కేంద్ర మంత్రులతో భేటీ!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం నిర్వహిస్తున్న ‘జలమంథన్’ సమావేశంలో పాల్గొననున్న ఆయన అందులో కీలకోపన్యాసం చేయనున్నారు. అంతకుముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ కానున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతోనూ సమావేశం కానున్న చంద్రబాబు, రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వెసులుబాటులు, పన్ను ప్రోత్సాహకాలపై మాట్లాడనున్నారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నూ చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్న చంద్రబాబు, నవ్యాంధ్ర కొత్త రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గాల ఏర్పాటు తదితరాలపై ఆయనతో చర్చిస్తారు. ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమావేశం కానున్నారు. ఉదయం నుంచి ఢిల్లీలో పలు భేటీలు నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.