: న్యూయార్క్ ను కమ్మేసిన మంచు... ఇళ్లకు పరిమితమైన ప్రజలు
న్యూయార్క్ ను మంచు కమ్మేసింది. గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూయార్క్ స్టేట్ ను మంచుతుపాను అతలాకుతలం చేసింది. సుమారు మూడు అడుగుల మేర మంచు రాష్ట్రంలోని పలు నగరాలను కప్పేసింది. బఫెల్లో నగరంపై నేడు కూడు మరో మంచుతుపాను తన ప్రభావం చూపనుంది. దీంతో, నగరంపై మరో రెండు లేక మూడు అడుగుల మంచు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ న్యూయార్క్ లో మంచు ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, రోడ్లు పూర్తిగా మూసుకుపోవడంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇళ్లలోంచి ప్రజలు బయటికి రావడం లేదు. న్యూయార్క్ లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.