: భారత్ కు వైట్ వాష్ ఖాయం: మెక్ గ్రాత్ జోస్యం
ఆసీస్ పర్యటన టీమిండియాకు కడగండ్లు మిగుల్చుతుందంటున్నాడు పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్. టెస్టు సిరీస్ లో కంగారూలు 4-0తో భారత్ ను వైట్ వాష్ చేస్తారని జోస్యం చెప్పాడు. "2011-12లో మేం 4-0తో నెగ్గాం, వాళ్లు 2012-13లో 4-0తో భారత్ లో నెగ్గారు. ఇప్పుడు వాళ్లు ఇక్కడికి వస్తే అదే ఫలితం వస్తుంది" అని మెక్ గ్రాత్ ను ఉటంకిస్తూ 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పత్రిక పేర్కొంది. కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయంతో తప్పుకున్నా, టెస్టు సిరీస్ లో ఆసీస్ కు భారత్ సవాల్ విసరలేదని ధీమాగా చెప్పాడు. విదేశీ గడ్డపై భారత్ పేలవ ప్రదర్శన గురించి చెబుతూ, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనను ఎత్తిచూపాడు. ఆ పర్యటనలో చివరి మూడు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలైందన్నాడు. ప్రస్తుత భారత జట్టులో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ స్థాయిలో ఆడే ఆటగాళ్లు లేరని మెక్ గ్రాత్ వ్యాఖ్యానించాడు.