: 'ఇసిస్'పై నిషేధం దిశగా భారత్ చర్యలు!
ఇరాక్, సిరియాల్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న ఇసిస్ (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపుపై నిషేధం విధించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అందిన నివేదికపై అభిప్రాయం చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు హోం శాఖ లేఖ రాసింది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసేందుకు ఆ దేశాల పాలనాధికారాన్ని చేజిక్కించుకునే దిశగా భీకర దాడులకు పాల్పడుతున్న ఇసిస్, భారత పౌరులను కూడా టెర్రరిజంవైపు ఆకర్షిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధారాలతో హోం శాఖకు నివేదిక సమర్పించింది. అంతేగాక, ఇసిస్ పై నిషేధం విధించకపోతే, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో, వేగంగా స్పందించిన హోం శాఖ, ఎన్ఐఏ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఎన్ఐఏ అభిప్రాయం రాగానే ఇసిస్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.