: పోలీసులపైకి రాంపాల్ గూండాల కాల్పులు
వివాదాస్పద స్వామి బాబా రాంపాల్ అనుచరులు హిసార్ లోని ఆశ్రమం వద్ద మంగళవారం పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. బాబాను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపైకి తిరగబడ్డ రాంపాల్ గూండాలు ఏకంగా కాల్పులకూ దిగారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినా బాబా భక్తులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మహిళా భక్తులు కూడా పోలీసులపైకి తిరగబడ్డారు. దీంతో పోలీసులు కూడా కాస్త కటువుగానే వ్యవహరించారు. టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించిన పోలీసులు, రబ్బరు బుల్లెట్లను కూడా ప్రయోగించారు. కొంత మంది పోలీసులు బయట భక్తులతో పోరు సాగిస్తుండగా, మరికొందరు ఆశ్రమం లోపలికి వెళ్లినట్లు సమాచారం. అసలు లోపల ఏం జరుగుతోందన్నది తెలియరావడం లేదు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. హైకోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు ఎటు తిరిగి రాంపాల్ ను అరెస్ట్ చేయాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని బలగాలను అక్కడికి రప్పిస్తున్నారు.