: బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్ తో దోస్తీకి సిద్ధం: మమతా బెనర్జీ
నిన్నటికి నిన్న కాంగ్రెస్, వామపక్షాలతో వేదికను పంచుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం మరో సంచలన ప్రకటన చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు వామపక్షాలతో జతకట్టేందుకూ వెనుకాడబోమని ఆమె ప్రకటించారు. మంగళవారం ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు ప్రకటించిన ఆమె, దేశవ్యాప్త చర్చకు తెర తీశారు. నిన్నటిదాకా పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం అలుపెరుగని రీతిలో వామపక్షాలపై పోరు సాగించిన ఆమె, తాజాగా అదే పార్టీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించడంపై రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతున్నారు. మతతత్వ రాజకీయ శక్తులను అణచివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆమె, అదే భావనతో ఉన్న వామపక్షాలతో కలిసి పోరు సాగించనున్నామని ప్రకటించారు. ఈ విషయంలో తమ రెండు పార్టీల మధ్య సారూపత్య ఉందని మమత వెల్లడించారు. వామపక్షాలతో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ, మతతత్వ శక్తులపై సాగించనున్న పోరులో మాత్రం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే మమత ఆఫర్ ను స్వీకరించబోమని సీపీఎం నేత మొహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం.