: అమితాబ్ రాక కోసం గంగూలీ, డోనా ఎదురుచూపులు!
టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పొరుగింటి అమ్మాయి డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. డోనా మంచి నాట్య కళాకారిణి. కోల్ కతాలో ఆమె 'దీక్షా మంజరి' పేరిట ఓ నాట్య శిక్షణాలయం నిర్వహిస్తోంది. డోనాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం. అమితాబ్ ఒక్కసారైనా తన డాన్స్ స్కూల్ ను, నివాసాన్ని సందర్శిస్తే బాగుండునన్నది ఆమె ఆకాంక్ష. ఈ విషయం తెలుసుకున్న గంగూలీ భార్య ముచ్చట తీర్చాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, అమితాబ్ ను కలిసిన ప్రతిసారి తమ ఇంటికి రావాలంటూ ఆహ్వానించేవాడు. తాను కోల్ కతా వస్తే మాత్రం తప్పక మీ ఇంటికి వస్తానని బిగ్ బి దాదాకు హామీ ఇచ్చాడట. ప్రస్తుతం, అమితాబ్ నటిస్తున్న బెంగాలీ చిత్రం పికు కోల్ కతాలోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే గంగూలీ దంపతులు ఐఎస్ఎల్ సాకర్ మ్యాచ్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో అమితాబ్ ను కలిసి, ఆహ్వానించారు. దాంతో, ఆయన ఈ సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో ఎప్పుడైనా వస్తానని మాటిచ్చాడట. ఇప్పుడాయన కోసం గంగూలీ, డోనా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.