: రోడ్లపైనే కార్ల షోరూంలు, హోటళ్లు...తుళ్లూరుకు కొత్త కళ!
నవ్యాంధ్ర కొత్త రాజధాని తుళ్లూరు కొత్త కళతో కళకళలాడుతోంది. రోడ్లకిరువైపుల ఏర్పాటు చేసిన టెంట్లలోనే ఖరీదైన కార్ల కంపెనీలతో పాటు బిర్యానీ హోటళ్లు కూడా వెలిశాయి. రాజధానిగా ఏర్పాటు కాబోతున్న తుళ్లూరులో భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో భారీ ఆదాయాలు వస్తాయన్న భావనతో పెద్ద ఎత్తున రియల్టర్లు భూములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో డబ్బు సంచులతో తుళ్లూరు కళకళలాడిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు కార్ల కంపెనీలు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలకు మంచి డిమాండ్ లభిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్లు విక్రయమైపోయాయి. ఇక అక్కడికి తండోపతండాలుగా వస్తున్న రియల్టర్ల ఆకలి తీర్చేందుకు ఏర్పడ్డ హోటళ్లు కూడా భారీగానే లాభాలు ఆర్జిస్తున్నాయి. పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలు సాగుతున్న నేపథ్యంలో నకిలీ నోట్ల భయాన్ని పారదోలేందుకు విద్యావంతులు కొందరు మనీ కౌంటర్లను ఏర్పాటు చేసి కమిషన్ల పేరిట భారీగానే జేబులు నింపుకుంటున్నారు. ప్రస్తుతం తుళ్లూరు ఖరీదైన కార్లతో నిత్యం రద్దీగా మారింది.