: మాకు హక్కులు లేవా?...మంత్రులే సభను తప్పుదోవ పట్టిస్తే ఎలా?: కిషన్ రెడ్డి
తెలంగాణ శాసనసభలో అధికారపక్షం నేతల వ్యవహార శైలిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసినప్పుడు తామంతా సభలోనే ఉన్నామని, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేయనప్పటికీ వారిని సస్పెండ్ చేసి దుస్సంప్రదాయానికి తెరతీశారని అన్నారు. వారిని సస్పెండ్ చేసి మూడురోజులు గడిచిందని, ఇప్పటికైనా సస్పెన్షన్ ఉపసంహరించుకుంటే హుందాగా ఉంటుందని ఆయన హితవు పలికారు. సస్పెన్షన్ ఉపసంహరించుకుంటే బాగుంటుందని తాము సూచిస్తే, ఏ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో చెప్పి ప్రతిపక్షాలను అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాసనసభ్యులుగా సభలో మాట్లాడే హక్కు అందరికీ ఉందన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.